₹11 లక్షల రివార్డు ఉన్న 6 మంది కూడా లొంగిపోయారు
ఈ ఏడాదిలో 107 మంది లొంగిపోగా, 143 మంది అరెస్ట్
భద్రతా బలగాలపై ఐఈడీ పేలుడు – 4 జవాన్లకు గాయాలు
మావోయిస్టుల అణచివేత కొనసాగుతున్న భద్రతా దళాలు
తెలంగాణ ధ్వని : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం 22 మంది మావోయిస్టులు పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. సీఆర్పీఎఫ్ డీఐజీ దేవేంద్ర సింగ్ నేగి, జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తదితర ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోయిన వారిలో ఏఓబీ (ఆంధ్ర – ఒడిశా బోర్డర్) డివిజన్ పార్టీ సభ్యులు, తెలంగాణ రాష్ట్రపార్టీ కమిటీ ప్లాటూన్ 9, 10 సభ్యులు, గంగలూరు, పామేడు, ఇరమగుండ ఆర్పీసీ (రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ) సభ్యులు ఉన్నారు.
లొంగిపోయిన 22 మంది మావోయిస్టుల్లో ఆరుగురికి రూ.11 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారందరూ ప్రభుత్వ పునరావాస పథకాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ సూచించారు.
ఈ సంవత్సరం ఇప్పటివరకు బీజాపూర్ జిల్లాలో 107 మంది మావోయిస్టులు లొంగిపోగా, 143 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే 82 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు ఎస్పీ వెల్లడించారు.
ఇదేరోజు సాయంత్రం ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాల వాహనంపై ఐఈడీ పేలుడు జరిపి, ఆపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి భూపాలపట్టణం జాతీయ రహదారి వద్ద గొర్ల నల్ల ప్రాంతంలో జరిగింది.
పోలీసు, భద్రతా దళాలు మావోయిస్టుల అణచివేతను మరింత ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టుల లొంగింపు సంఖ్య పెరుగుతోంది. మరోవైపు, మావోయిస్టులు తమ ప్రాబల్యం తగ్గిపోతున్న తరుణంలో దాడులు ముమ్మరం చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక