తెలంగాణ ధ్వని న్యూస్ : హనుమకొండ జిల్లా, ధర్మసాగర్ మండలంలో పాఠశాల స్థాయిలోనే రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. మండల విద్యాధికారి డాక్టర్ రామ్ధన్ ఆధ్వర్యంలో, జిల్లా పాలనాధికారి మరియు జిల్లా విద్యాశాఖ అధికారి గారి ఆదేశాల మేరకు ధర్మసాగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ధర్మసాగర్ స్కూల్ కాంప్లెక్స్ ఇన్చార్జి, ప్రధానోపాధ్యాయులు ధర్మ ప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డాక్టర్ రామ్ధన్ మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్ పౌరులుగా రహదారి భద్రత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని, రోడ్డు భద్రత అంటే కేవలం నియమాలు పాటించడమే కాదని, అందరి భద్రత అని అన్నారు. రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం సరైన భద్రతా మార్గదర్శకాలు పాటించకపోవడమేనని తెలిపారు. ధర్మ ప్రకాష్ మాట్లాడుతూ, రహదారి భద్రత అందరి బాధ్యత అని, సురక్షిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించాలని అన్నారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో వ్యాసరచన, వకృత్వం, స్కిట్, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు కవిత, పద్మజ, శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు జనవరి 24న హనుమకొండలోని ప్రభుత్వ బాలిక పాఠశాల లష్కర్ బజార్‌లో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని డాక్టర్ రామ్ధన్ తెలిపారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక