తెలంగాణ ధ్వని :సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో ముందంజ వేస్తుందని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ అన్నారు. గురువారం, పట్టణంలోని 38వ వార్డ్‌లోని అశోక్‌నగర్ సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన అశోకచక్రం చౌరస్తాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అశోక చక్రం భారతదేశానికి గర్వకారణమని, ఇది స్వాతంత్రం, శాంతి, మరియు ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
ఈ ప్రారంభ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దుబ్బాక లావణ్య, కౌన్సిలర్ గూడూరి భాస్కర్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా, 19వ వార్డ్‌లో సీసీ రోడ్డు పనులకు చైర్‌పర్సన్ భూమిపూజ చేశారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన సీసీ రోడ్డు శిథిలావస్థకు చేరడంతో రూ. 6 లక్షలు జనరల్ ఫండ్ నిధుల కేటాయింపుతో ఈ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ అభివృద్ధి పనులు పట్టణాన్ని మరింత సుందరంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజల సహకారంతో అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతాయని చైర్‌పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్, ఇతర అధికారులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రిపోర్టర్. కడకుంట్ల అభిలాష్