తెలంగాణ ధ్వని : రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కొత్త రేషన్ కార్డుదారులకు ఈ నెల నుంచే బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసి, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది.
గత నెలలో ప్రతి మండలంలో గ్రామ సభల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసి కొత్త రేషన్ కార్డులను జారీ చేశారు. ఇప్పుడు, కొత్త కార్డుదారులకు తక్షణమే బియ్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అంతేగాక, ఇంకా అర్హులైన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు జిల్లాల్లో 1,01,103 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీరి అర్హతను పరిశీలించి, వచ్చే నెల నుంచి వారికి కూడా బియ్యం అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.
జాబితాలో పేరు లేకుంటే ఏంచేయాలి?
రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే సంబంధిత గ్రామసభలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు అందించే వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. సామాజిక ఆర్థిక సర్వే, కులగణన, పాత రేషన్ కార్డుల ఆధారంగా జాబితా రూపొందించారని, ఇందులో పేరు లేకుంటే గ్రామసభలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందజేయడంతో పాటు, సమయానికి నిత్యావసర సరుకులు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ చర్యలతో రేషన్ కార్డు లబ్ధిదారులకు మరింత ప్రయోజనం కలగనుంది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక