తెలంగాణ ధ్వని : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఈ ఫలితాలపై తెలంగాణలోని రాజకీయ నేతలు తమదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ, “మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలు పూర్తిగా ఫెయిలయ్యాయి. హామీలు అమలు చేయకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరు,” అని అన్నారు.
మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు కూడా కాంగ్రెస్ పార్టీపై ఎద్దేవా చేస్తూ, “ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు ఇచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అధికారాన్ని కోల్పోయింది. ఉచిత హామీలతో ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు ఇదొక గుణపాఠం,” అని అన్నారు.
తెలంగాణ బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ ఫలితాలు మోడీ నాయకత్వంపై ప్రజల మద్దతును చాటుతున్నాయి. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోంది,” అని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక