-
మార్చి 30: భూ భారతి పోర్టల్ అధికారికంగా ప్రారంభం.
-
తదుపరి 10 రోజుల్లో: ప్రతి అంశాన్ని విడతల వారీగా అమలు చేస్తూ పోర్టల్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
-
రైతుల కోసం ప్రత్యేక సేవలు: భూమి పత్రాలు సవరించడానికి కొత్త ప్రణాళిక రూపొందించనున్నారు.
తెలంగాణ ధ్వని : తెలంగాణలో భూ పరిపాలనలో కీలక మార్పు రాబోతోంది. మరికొన్ని రోజుల్లో ధరణి పోర్టల్‌ను తొలగించి, భూ భారతి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నెల 30వ తేదీన www.BhuBharathi.telangana.gov.in అధికారికంగా ప్రారంభం కానుంది. భూ హక్కుల రక్షణ, ప్రజలకు సులభతర సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని రూపొందించింది.
ధరణి పోర్టల్ నుంచి భూ భారతికి మార్పు – కారణాలు
ధరణి పోర్టల్‌లో అనేక సాంకేతిక సమస్యలు, వ్యవస్థాపిత లోపాల కారణంగా లక్షలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా, స్లాట్ బుకింగ్ సమస్యలు, భూ రికార్డుల అప్‌డేట్ నెమ్మదిగా ఉండటం, ఫైళ్ల అప్లోడ్ సమస్యలు రైతులకు మరింత చికాకుగా మారాయి. కొత్తగా తీసుకువస్తున్న భూ భారతి పోర్టల్‌లో ఈ సమస్యలు లేకుండా పౌర సేవలను వేగంగా అందించేలా డిజైన్ చేశారు.
కొత్త భూ భారతి చట్టం – ముఖ్యాంశాలు
-
ప్రమాదాలు తగ్గింపు – గతంలో ధరణి పోర్టల్ అమలు చేసినప్పుడు వచ్చిన సమస్యలను మరోసారి రిపీట్ కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.
-
సులభతరం చేసిన భూ హక్కులు – భూమి సంబంధిత లావాదేవీలను వేగంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త మార్గదర్శకాలు రూపొందించారు.
-
తప్పులేని డేటా నిర్వహణ – భూ రికార్డులను కచ్చితంగా నిర్వహించి, భూస్వామ్య హక్కుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు.
-
స్టెబిలిటీతో ముందుకు – ఒకేసారి అమలు చేయకుండా, ప్రతి దశలో ప్రామాణిక పరీక్షలు జరిపిన తర్వాతే కొత్త మార్పులను తీసుకురానున్నారు.
ఎన్ఐసీకి కొత్త సవాల్ – భూ భారతి వేగవంతం
ధరణి పోర్టల్ నిర్వహణ సమయంలో ఎన్ఐసీ (National Informatics Centre) టెక్నికల్ టీమ్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. ఇప్పటికీ, ధరణి పోర్టల్‌లో ఏ మార్పు చేసినా డొమెయిన్ స్టెబిలిటీ ప్రభావితం అవుతున్న పరిస్థితి ఉంది. భూ భారతి పోర్టల్‌ను రూపొందించేటప్పుడు, ఈ సమస్యలు పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
పౌరులకు మరింత సౌలభ్యం
భూ భారతి పోర్టల్ ధరణి కంటే వేగంగా పనిచేస్తుంది. భూ రికార్డుల సవరణ, పట్టాదారుల పేర్ల మార్పు, రిజిస్ట్రేషన్లను నిర్వహించడంలో సులభతరం చేయడం దీనికి ప్రధాన లక్ష్యం. కొత్తగా “TM-33” ద్వారా భూ హక్కుల సవరణ అధికారాన్ని నిర్దిష్ట అధికారులకు అప్పగించనున్నారు.
భూ భారతి పట్ల భారీ అంచనాలు
ధరణి పోర్టల్ ఇచ్చిన అనుభవంతో భూ భారతి పట్ల ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వం, అధికార యంత్రాంగం, ఎన్ఐసీ ఈసారి అచ్చట తప్పకుండా పౌర సేవలను మెరుగుపరిచే దిశగా కృషి చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో భూ భారతి పోర్టల్ ఎలా పనిచేస్తుందో చూడాలి!
రిపోర్టర్. ప్రతీప్ రడపాక