telanganadwani.com

TelanganaPolitics

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ

పార్టీలో సమీకరణాలు – ఎవరికే అవకాశమొస్తుందా?

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.

నూతన అధ్యక్షుడిపై ఉత్కంఠ.

తెలంగాణ ధ్వని : తెలంగాణలో బీజేపీ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య విజయంతో రాష్ట్రంలో పార్టీ పట్టు బిగించినట్టు భావించిన హైకమాండ్, ఇప్పుడు రాష్ట్ర బీజేపీని మరింత శక్తివంతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే అంశం కీలకంగా మారింది. ప్రస్తుతం ఎంపీ బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటికీ, ఇప్పుడు మరో మార్పు చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా ఈసారి బీసీ వర్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే హైకమాండ్ యోచన నేపథ్యంలో, నూతన అధ్యక్షుడి ఎంపిక కీలకంగా మారింది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, నూతన అధ్యక్ష పదవికి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయనకు హైకమాండ్ మంచి ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. మరోవైపు, మురళీధర్ రావు, డీకే అరుణ పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతుండటంతో రెడ్డి వర్గానికి మరల అధ్యక్ష పదవి ఇవ్వకూడదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీంతో, బీసీ వర్గానికి చెందిన నాయకునికి  నూతన అధ్యక్షుడిగా అవకాశం దక్కే అవకాశం ఉంది.

ఈ మార్పుల నేపథ్యంలో, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై వస్తున్న ప్రచారాలపై ఆయన స్పందిస్తూ, తాను పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. అదేవిధంగా, తన పేరు ముందుకు తేవడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంజయ్, బీదర్‌లో దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని ఆరోపించడం రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం అధినాయకత్వ మార్పు కీలక మలుపు తిరుగుతోంది. పార్టీకి చెందిన సీనియర్ నేతలు హైకమాండ్‌తో సంప్రదింపులు జరుపుతుండగా, అధికారిక ప్రకటనకు ముహూర్తం దగ్గర పడింది. వచ్చే వారం లేదా మరుసటి వారం నూతన రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ తన కొత్త నాయకత్వంతో 2028 ఎన్నికల దిశగా ముందుకు వెళ్లేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

మొత్తంగా, తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుంది. బీజేపీ గెలిచిన 8 పార్లమెంట్ స్థానాలను మరింత బలోపేతం చేసుకునేలా, భవిష్యత్తులో పార్టీకి మద్దతుగా నిలిచే సామాజిక వర్గాలను ఆకర్షించేలా హైకమాండ్ వ్యూహాలను రచిస్తోంది. బీజేపీ నాయకత్వ మార్పు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top