తెలంగాణ ధ్వని : తెలంగాణలో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలకు తెరదించేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల అసెంబ్లీలో ఆశావహులు ధీమా వ్యక్తం చేసినట్టుగానే, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు పిలుపు వచ్చినట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. వారు సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు.
కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
ఈ ఢిల్లీ పర్యటనలో కేబినెట్ విస్తరణకు తుది ముహూర్తం, మంత్రుల జాబితా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ ఇప్పటికే ఆలస్యమైందని, త్వరలోనే దీనిని అమలు చేయాలని అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అన్ని వర్గాలను, జిల్లాలను, ఎన్నికల హామీలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవుల పంపిణీ జరగనుంది.
మంత్రి పదవుల కోసం పోటీ
కేబినెట్‌లో చోటు కోసం అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బలు నాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వంటి వారు మంత్రివర్గంలో చోటు కోసం పోటీలో ఉన్నారు.
రిపోర్టర్. కళ్యాణి