బీసీ వర్గానికి చెందిన ఇద్దరు నేతలు
ఒకరు రెడ్డి వర్గానికి చెందిన నేత
ఒకరు ఎస్సీ వర్గానికి చెందిన నేత
మైనారిటీ వర్గానికి అవకాశం?
తెలంగాణ ధ్వని : తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2023 డిసెంబర్ 4న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 11 మంది మంత్రులతో ప్రభుత్వాన్ని ప్రారంభించారు. అయితే, మొత్తం 18 మంది మంత్రులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, అప్పట్లో కేవలం 12 మంది మాత్రమే మంత్రివర్గంలో స్థానం పొందారు. మిగిలిన ఖాళీలను భర్తీ చేయడానికి కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలన జరిపింది. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 3న నలుగురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈసారి మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ నేతలు కొత్త మంత్రులను ఎంపిక చేశారు. మొత్తం నలుగురు మంత్రుల్లో ఇద్దరు బీసీ వర్గానికి చెందినవారు, ఒకరు రెడ్డి వర్గానికి, మరొకరు ఎస్సీ వర్గానికి చెందినవారు. పార్టీ వ్యూహకర్తలు సామాజిక వర్గాల సమతుల్యతను కాపాడుతూ, భవిష్యత్తులో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపికలు చేసినట్లు తెలుస్తోంది.
ఎవరెవరికీ మంత్రి పదవి దక్కనుంది?
ప్రస్తుతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే వ్యక్తుల గురించి అనేక ఊహాగానాలు ఉన్నాయి.
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల ఎంపికలో పోటీ తీవ్రంగా ఉంది. రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కే అవకాశం ఉంది. రెడ్డి వర్గం తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమికను పోషిస్తోందని, వారు బీజేపీ వైపుకు వెళ్లకుండా కాంగ్రెస్ కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కనుందని సమాచారం. తెలంగాణలో ఎస్సీ వర్గం ఓటు బ్యాంకును పటిష్ఠంగా ఉంచుకునేందుకు కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీసీ వర్గం నుంచి ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్‌లకు మంత్రిపదవి దక్కే అవకాశముంది. బీసీ సామాజిక వర్గం తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన వర్గం కావడంతో, వారికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ భవిష్యత్తులో రాజకీయ లబ్ధి పొందాలనే వ్యూహంతో ఉందని అంటున్నారు.
ప్రస్తుతం నాలుగు ఖాళీలను మాత్రమే భర్తీ చేయనున్నట్లు తెలిసింది. అయితే, ఒక అదనపు స్థానం భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తే, మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు అవకాశం లభించే అవకాశముంది. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ వర్గాన్ని ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక