- అక్రమ మద్యం రవాణాపై పకడ్బందీగా నిఘా
- డ్రగ్స్, ఇతర నిషేధిత పదార్థాల సరఫరాను నియంత్రణ
- ప్రమాదకరమైన మద్యం అమ్మకాలను అరికట్టడం
- మద్యం విక్రయాలపై మరింత క్రమబద్ధమైన నియంత్రణ
తెలంగాణ ధ్వని : తెలంగాణలో ఎక్సైజ్ నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ స్టేషన్లు ఏప్రిల్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. 2020లోనే కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. చివరకు అన్ని అనుమతులు పూర్తయ్యాయి, మరియు విభజన, బదలాయింపు పనులు పూర్తి కావడంతో ప్రభుత్వం అధికారికంగా వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో హైదరాబాద్‌లో 13 స్టేషన్లు, వరంగల్ అర్బన్‌లో ఒక స్టేషన్ ఏర్పాటు కానున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రణాళిక ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో మద్యం నియంత్రణ, అక్రమ మద్యం రవాణా, డ్రగ్స్ సరఫరా, ఇతర నిషేధిత కార్యకలాపాలను నియంత్రించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నిర్ణయానికి సంబంధించి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రిస్వి, ఎక్సైజ్ కమిషనర్ చెవ్వూరు హరి కిరణ్ ఆమోద ముద్ర వేశారు. ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ అజయ్‌రావు, ఆయా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లకు కొత్త పోలీస్ స్టేషన్లు ఏప్రిల్ 1 నుంచి విధులు ప్రారంభించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల కోసం అద్దె భవనాలను గుర్తించే పనిని కూడా వేగవంతం చేశారు. ప్రస్తుతం బంజారాహిల్స్, చిక్కడపల్లి, గండిపేట్, కొండపూర్, కూకట్పల్లి, అమీన్పూర్, హసన్‌పర్తి ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల కోసం అద్దె భవనాల గుర్తింపు పూర్తయింది. అయితే, మారేడ్‌పల్లి, మీర్పేట్, కొంపల్లి, కాప్రా, నాచారం, అల్వాల్ ప్రాంతాల్లో కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన భవనాలు ఇంకా లభించలేదు. అందువల్ల, ఈ ప్రాంతాల్లో ప్రస్తుత ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలోని ప్రత్యేక గదుల్లోనే తాత్కాలికంగా స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన నేపథ్యంలో, కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కీలకంగా మారింది. రాష్ట్రంలో నిషేధిత మద్యం అమ్మకం, అక్రమంగా మద్యం రవాణా, డ్రగ్స్ సరఫరా వంటి అంశాలను పర్యవేక్షించి నియంత్రించేందుకు వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ఎక్సైజ్ స్టేషన్ల ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్లపై భారం తగ్గి, ఎక్సైజ్ శాఖ మరింత సమర్థంగా పనిచేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక