telanganadwani.com

KCR

హన్మకొండలో ఏప్రిల్ 27న ఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ

తెలంగాణ ధ్వని : ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న ఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రజతోత్సవ సభపై ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉందని, ఈ సభకు లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సభ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు భూమిపూజ నిర్వహించనున్నారు. సభ విజయవంతం కావాలని, పాల్గొనే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన ఆయన, మార్పు కోరుకున్న రైతుల కళ్లల్లో కన్నీళ్లే మిగిలాయని, ఇలాంటి దుస్థితి వస్తుందని తాను ఊహించలేదని అన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇతర వర్గాల ప్రజలు కూడా మనోధైర్యం కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. ఎల్కతుర్తిలో సభ కోసం మొత్తం 1214 ఎకరాలను కేటాయించగా, 1000 ఎకరాలను పార్కింగ్ కోసం, 150 ఎకరాలను సభ నిర్వహణ కోసం వినియోగించనున్నారు. ఎండ కాలం నేపథ్యంలో సభకు వచ్చే ప్రజలు, కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కేసీఆర్ ఆదేశించారు. సభ ప్రాంగణంలో నీటి సరఫరా, టెంట్లు, వైద్య సదుపాయాలు, బారికేడింగ్, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ సభలో పాల్గొనేందుకు సిద్ధమవుతుండగా, సభ విజయవంతం చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్కతుర్తిలో ఈ భారీ సభ ద్వారా ప్రజల్లో విశేష స్పందన రావచ్చని బీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top