telanganadwani.com

గ్రామీణ జర్నలిస్టుల హక్కుల కోసం ఉద్యమ బాటలో డబ్ల్యూజేఐ

  • విలేకరులపై అదనపు భారం.
  • అకాల మరణాలు, ప్రభుత్వ విఫలం.
  • వేజ్‌బోర్డ్ అమలు చేయాలి.

తెలంగాణ ధ్వని : గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న విలేకరులకు వేతనాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర స్థాయిలో విస్తృత ఉద్యమం ప్రారంభించనున్నట్లు వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) నేతలు స్పష్టం చేశారు.

జనగామలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక కమిటీ సమావేశంలో డబ్ల్యూజేఐ ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ కుమార్, వరంగల్ కన్వీనర్ పులి శరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ—గ్రామీణ విలేకరులు అనేక సమస్యలతో అల్లాడుతున్నా, పత్రికల యాజమాన్యాలు వారిని వ్యాపార వస్తువుల్లా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వేతనాల్లేకుండా పని చేయించడమే కాకుండా, ప్రకటనలు, చందాలు, క్యాలెండర్ల పేరుతో భారీ టార్గెట్లు విధించడం వల్ల విలేకరులు ఆర్థికంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. పండుగలు, వార్షికోత్సవాల సమయంలో ప్రత్యేక టార్గెట్లతో వారి శ్రమను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.

2014 నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో 500 మందికి పైగా జర్నలిస్టులు మరణించగా, వీరిలో చాలా మంది గుండెపోటు, కరోనా, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. జర్నలిస్టుల మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు ఈ మరణాలకు కారణమని వివరించారు.

పత్రికా యాజమాన్యాలు వేజ్ బోర్డు సిఫారసులను అమలు చేయకుండా, తమకు అనుకూలంగా న్యూస్ ఏజెన్సీ పేరిట సిబ్బందిని నియమించుకుంటున్నాయని మండిపడ్డారు. 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పత్రికలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఈ సమావేశంలో డబ్ల్యూజేఐ నాయకులు యంసాని శ్రీనివాస్, ఆరెల్లి రాధాకృష్ణ, తెలంగాణ ధ్వని జనగాం బ్యూరో చీఫ్ సంగ కిరణ్ ప్రసాద్, రడపాక ప్రదీప్, బండ్ల కరుణాకర్, వల్లాల శివ, కృష్ణమూర్తి, సంగోజు శ్రీనివాస్, జావిద్, రాజు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top