తెలంగాణ ధ్వని : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ అత్యంత ఉత్కంఠతో కొనసాగుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోని కర్రెగుట్ట ప్రాంతంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సీఆర్‌పీఎఫ్, గ్రేహౌండ్స్, రాష్ట్ర పోలీస్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే ఈ ఆపరేషన్ ప్రారంభమై, మంగళవారం నాటికి మావోయిస్టులతో ఎదురుకాల్పులకు దారి తీసింది. ఈ కాల్పులు ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధి నుంచి Telangana వైపు సాగాయి. మావోయిస్టుల బెదిరింపులు, ఇటీవలి హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టుల చురుకైన ప్రస్థానం ఉండటంతో, హిడ్మా నేతృత్వంలోని దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నదన్న సమాచారం కేంద్ర బలగాలకు అందింది. దాంతో, దాదాపు 2000 మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించి, చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడలా గాలిస్తున్నారు. ముఖ్యంగా పెనుగోలు, అరుణాచలపురం, బొల్లారం, ముత్తారం, లక్ష్మీపురం, ముకునూరు వంటి గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు భయంతో ఇళ్ల్లోనే తలదాచుకున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, అన్ని రవాణా మార్గాలను భద్రతా బలగాలు నిర్బంధించాయి. మావోయిస్టుల కదలికలపై డ్రోన్ల సహాయంతో పర్యవేక్షణ కొనసాగుతోంది. సీనియర్ పోలీస్ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలందరూ శాంతిని పాటించాలని, సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రాణనష్టం గురించిన ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే, మావోయిస్టులు భారీగా ఆయుధాలతో ఉన్న అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ ఆపరేషన్ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముంది. ములుగు జిల్లాలో దాడులు, ఎదురుకాల్పులు జరగడం ఇటీవల కాలంలో ఇదే పెద్ద స్థాయిలో జరగడం ఇది మొదటిసారి కావచ్చు. దండకారణ్యంలో శాంతిని నెలకొల్పాలనే లక్ష్యంతో భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయి.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక