telanganadwani.com

“దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మురళి నాయక్‌కి ఘన నివాళి”

తెలంగాణ ధ్వని : శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితాండా గ్రామానికి చెందిన అగ్నీవీర్ జవాన్ మురళి నాయక్ (వయస్సు: 22) జమ్మూకశ్మీర్‌లో భారత్-పాకిస్థాన్ సరిహద్దులో జరిగిన ఎదురు కాల్పులలో గురువారం అర్ధరాత్రి దేశ సేవలో వీరమరణం పొందారు.                                                                                                                                                   చిన్నతనం నుండే దేశభక్తితో మురళి నాయక్ రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని వదులుకొని 2022 డిసెంబరులో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నీవీర్‌గా భారత సైన్యంలో చేరాడు.

ఆయన వీరమరణ వార్తతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. తండ్రి శ్రీరాంనాయక్, తల్లి జ్యోతిబాయి మరియు కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో ఉన్నారు.                                                                                                                      మురళి నాయక్ మృతదేహం ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం 6 గంటలకు స్వగ్రామమైన కళ్లితాండాకు చేరుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ఇతర ఉన్నతాధికారులు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.                                                                         కల్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీ అమిలినేని సురేంద్రబాబు మురళి నాయక్ కుటుంబానికి ఒక నెల జీతాన్ని విరాళంగా అందించారు.

మురళి నాయక్ సేవలు దేశానికి చిరస్మరణీయంగా నిలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వారి కుటుంబానికి పూర్తి మద్దతు అందిస్తుందని హామీ ఇస్తున్నాం.

రిపోర్టర్ : అనూష కల్తీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top