తెలంగాణ ధ్వని : హైదరాబాద్‌లో ఓ తండ్రి తన కూతురి భవిష్యత్తును రక్షించేందుకు తీసుకున్న కఠిన నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆవేదన కలిగిస్తోంది. ఏడేళ్లుగా మత్తుకు బానిసైన యువతిని చూసి, ఆమె జీవితంలో మార్పు రావాలని ఎన్నో సార్లు ప్రయత్నించిన తండ్రి.
చివరకు గట్టి నిర్ణయం తీసుకుని, ఇన్‌ఫార్మర్‌గా మారాడు. తన కుమార్తె తనను తానే నాశనం చేసుకుంటుండటాన్ని చూసి కన్నతండ్రి తట్టుకోలేక, TG NABB అధికారులకు పూర్తి సమాచారం ఇచ్చి ఆమెను పట్టించేందుకు సహకరించాడు.
ఈ మహిళ ఒకప్పుడు స్పెయిన్ దేశానికి ఉన్నత చదువుల కోసం వెళ్లింది. అక్కడే మొదటగా కొకైన్‌కు అలవాటు పడి, మత్తులో మునిగిపోయింది. విద్య పూర్తయిన తరువాత స్వదేశానికి తిరిగొచ్చినా ఆ అలవాటు మాత్రం మానలేదు.
ముంబయిలో పరిచయమైన డ్రగ్ సరఫరాదారుడి ద్వారా, వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తూ కొకైన్‌ను తెప్పించుకునే దాకా వెళ్లింది. నగరానికి వచ్చిన డెలివరీ ఏజెంట్‌కి లొకేషన్ పంపడం, వాహన ఫోటో షేర్ చేయడం వంటి ప్రక్రియతో డ్రగ్స్‌ను తన వద్దకు తెప్పించుకుని వినియోగిస్తూ వచ్చిందని విచారణలో వెల్లడైంది.
అంతే కాదు, “ఇది నేరమా? ఇంకా చాలా మంది తీసుకుంటున్నారు” అంటూ విచారణలో పోలీసులను ఎదిరిస్తూ ప్రశ్నించిందట. తాను కొకైన్‌ను పంటికి రుద్దుకుని 6-7 గంటల పాటు మత్తులో ఉండేదాన్నని చెప్పిన ఆమె,
గత ఏడేళ్లలో దాదాపు కోటి రూపాయల విలువైన డ్రగ్స్ కొనుగోలు చేసిందని ఆర్థిక లావాదేవీల పరిశీలనలో స్పష్టమైంది. కూతురి భవిష్యత్తును పునర్నిర్మించాలనే తపనతో తండ్రి TG NABB అధికారులపై నమ్మకంతో ముందుకు వచ్చాడు.
ఆమె అన్ని కార్యాచరణలపై సమాచారం ఇచ్చి, సరైన సమయాన పోలీసులకు సహాయం చేసి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేలా చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఆమెను రిహాబిలిటేషన్ కేంద్రానికి పంపి, కౌన్సెలింగ్ ద్వారా మత్తు వ్యసనాన్ని వదిలించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలాంటి సంఘటనలు తల్లిదండ్రులకు పెద్ద హెచ్చరిక. పిల్లల ప్రవర్తనలో ఎటువంటి మార్పులు కనిపించినా, వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది.
ఒక తండ్రి చేసిన ఈ ధైర్య నిర్ణయం, మరో అమ్మాయి జీవితాన్ని తిరిగి గమనంలోకి తేనుందని భావిస్తున్నారు. పోలీసులు కూడా తల్లిదండ్రులను ఉద్దేశించి, “పిల్లల ప్రవర్తనలో చిన్ని మార్పు కనపడినప్పుడే మేము సమాచారం ఇస్తే, వాళ్ల భవిష్యత్తును రక్షించగలము.
సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. ఆలస్యం చేస్తే అది పిల్లల జీవితాన్ని నాశనం చేస్తుంది” అని తెలిపారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక