తెలంగాణ ధ్వని : భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం లో 12 ఏళ్ల తర్వాత నిర్వహించబడుతున్న సరస్వతి పుష్కరాలు నేటి ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి.
గురువారం ఉదయం 5:44 గంటలకు తోగుట ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామీజీ పుష్కర స్నానాలతో ఈ పుణ్యోత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా పుష్కర స్నానం చేయనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఏకశిల సరస్వతి మాత విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు.
ఈ పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం భక్తుల కోసం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఘాట్ వద్ద సినిమా సెట్‌ను తలపించే రీతిలో దేవాలయ సెట్ ఏర్పాటు చేయబడింది.
దాదాపు ఎకరం భూమిలో దీన్ని అందంగా తీర్చిదిద్దారు. భక్తుల వసతి కోసం 100 గదులతో వసతి గృహాలు, టెంట్ సిటీలు, ఏసీ, కూలర్ సౌకర్యాలతో అందుబాటులోకి తెచ్చారు.
స్నానాల కోసం షవర్లు, బట్టలు మార్చుకునే గదులు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం ఓవర్‌హెడ్ ట్యాంకులు, శాశ్వత మరుగుదొడ్లు, పిండ ప్రదాన మండపం నిర్మించారు.
శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు లడ్డు, పులిహోర ప్రసాదాలు, అలాగే ఉచిత అన్నదానం అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
భారీగా భక్తులు తరలిరావచ్చని అంచనా వేస్తూ, వారికి అవసరమైన దిశానిర్దేశం, భద్రతా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక