తెలంగాణ ధ్వని : జనగామ జిల్లా, జఫర్‌ఘడ్ మండలం, ఉప్పుగల్లు గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన 48 ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు నిరుపేద కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడిన బాధితులు, పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి స్పందిస్తూ, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మరియు జాబితాకు సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద లేదని తెలిపారు.
ఈ వివరాలు ఇందిరమ్మ గ్రామ కమిటీ, ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న తహసీల్దార్ మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపిడివో) వద్ద మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
దీంతో నిరాశ చెందిన నిరుపేదలు పంచాయతీ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపారు. తాము అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ తమ పేర్లు జాబితాలో లేకపోవడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు గృహాల మంజూరు కోసం ఒక వినతి పత్రాన్ని కార్యదర్శికి అందజేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నిజమైన అర్హత కలిగిన పేదలను గుర్తించకుండా, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు తమ అనుచరులకు మాత్రమే గృహాలు కేటాయించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పార్టీలకతీతంగా, నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ గృహాలు అందేలా చూడాలని వారు ప్రభుత్వ అధికారులను మరియు ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు బుర్ర తిరుపతి గౌడ్, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రాజు, బిజెపి మండల కార్యదర్శి బుర్ర స్వప్న, గ్రామ రాయల్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు బైరు వినయ్ మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక