- వేసవి శిక్షణలు పిల్లల అభివృద్ధికి తోడ్పడతాయి.
- కరాటే, డ్రాయింగ్ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.
- 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి..
తెలంగాణ ధ్వని : కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణ శిబిర ముగింపు కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. విద్యార్ధులు కేవలం పాఠశాల పాఠాలతోనే కాదు, ఇతర శారీరక, సృజనాత్మక రంగాలలోనూ ప్రావీణ్యం సాధించాలని సూచించారు.
క్రాఫ్ట్, డ్రాయింగ్ వంటి కళలు భవిష్యత్‌లో స్వయం ఉపాధికి మార్గం చూపుతాయని తెలిపారు. కరాటే శిక్షణ ద్వారా ఆత్మరక్షణ నైపుణ్యాలు పెరుగుతాయని వివరించారు.
ఈ శిక్షణల వల్ల పిల్లలు బాధ్యతతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకుంటారని పేర్కొన్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండటంలో ఇలాంటి శిబిరాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
క్రీడలు బాల్యంలోనే శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ శిక్షణల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధితో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రావూరి మాధవి అధ్యక్షత వహించగా, ఉపాధ్యాయులు గాడిపెల్లి పద్మ, కరుణకుమారి, బిక్షపతి, పరమేశ్వర్, అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. చివరగా కార్పొరేటర్ రవి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక