- 25.41 కోట్లతో వరంగల్ రైల్వే స్టేషన్ రూపకల్పన మరియు అభివృద్ధి.
- వరంగల్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకంలో అభివృద్ధి.
- కాకతీయ కళతో ఆభరణం చేసిన ఎంట్రన్స్ డిజైన్.
- ఆధునిక సౌకర్యాలతో పాటు సేఫ్టీ, శుభ్రతకు ప్రాధాన్యం.
- ప్రయాణికుల కోసం లిఫ్టులు, ఎస్కలేటర్లు, రాంపులు ఏర్పాటు.
- 31 వేల పైగా ప్రయాణికులకు మెరుగైన సేవల అందుబాటు..
తెలంగాణ ధ్వని : వరంగల్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “అమృత్ భారత్ స్టేషన్ పథకం”లో భాగంగా, ఈ చారిత్రక స్టేషన్‌ను రూ. 25.41 కోట్లతో ఆధునికంగా మలిచారు.
కాకతీయుల శిల్పకళను ప్రతిబింబించేలా ముఖద్వారాన్ని ప్రత్యేక శైలిలో నిర్మించారు. ఏనుగుల శిల్పాలు, కళాత్మక స్తంభాలు ప్రయాణికుల మనసును మురిపిస్తున్నాయి. గ్రానైట్ ఫ్లోరింగ్, విశాలమైన వెయిటింగ్ హాల్స్, ఆధునిక ఫర్నిచర్‌తో స్టేషన్ పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకుంది.
ప్రయాణికుల సౌలభ్యం కోసం మూడు లిఫ్టులు, నాలుగు ఎస్కలేటర్లు ఏర్పాటు చేయగా, వృద్ధులు మరియు దివ్యాంగుల కోసం ప్రత్యేక రాంప్‌లను కూడా ఏర్పాటు చేశారు. రాత్రివేళ ఎల్ఈడి వెలుగుల్లో స్టేషన్ మరింత ఆకర్షణీయంగా మారుతోంది.
స్టేషన్ ప్రాంగణమంతా డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, సమాచార సూచికలతో నిండి ఉంది. గోడలపై పల్లె జీవనశైలి చిత్రాలు, భారతీయ సంప్రదాయ కళలు దర్శనమిస్తున్నాయి. “ఐ లవ్ వరంగల్” సెల్ఫీ పాయింట్ సందర్శకులను ఆకట్టుకుంటోంది.
రోజూ సుమారు 31,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ను ఉపయోగిస్తుండగా, 130 రైళ్ల రాకపోకలతో ఇది ఒక కీలక రైల్వే హబ్‌గా ఎదిగింది. సుమారు రూ. 41 కోట్ల ఆదాయాన్ని రైల్వే ఈ స్టేషన్ ద్వారా పొందుతోంది.
ఎయిర్‌పోర్ట్ స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ స్టేషన్ ఇప్పుడు ప్రతి ప్రయాణికునికీ కొత్త అనుభూతిని అందిస్తోంది. చరిత్ర, సంస్కృతి, ఆధునికత మేళవింపుతో వరంగల్ స్టేషన్ నిజమైన ఆదర్శంగా నిలుస్తోంది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక