- వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.
- 171 కొత్త ఈపాస్ మెషిన్లు డీలర్లకు ఉచితంగా పంపిణీ.
- కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా పంపిణీ.
తెలంగాణ ధ్వని : వరంగల్ జిల్లాలో ఎరువుల విక్రయాలను పూర్తిగా ఈపాస్ {ePOS} మెషిన్ల ద్వారానే చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.
శుక్రవారం వరంగల్ శివనగర్ లోని సాయి కన్వెన్షన్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లాలోని రిటైల్ ఎరువుల డీలర్లకు కొత్త తరహా ఎల్ 1{L1} ఈపాస్ మెషిన్లను పంపిణీ చేయడం జరిగింది. కేంద్ర ఎరువుల శాఖ మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు,
కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో 171 ఈపాస్ మెషిన్లను ఉచితంగా డీలర్లకు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.
రైతులకు ఎరువుల సరఫరా నిబంధనల మేరకు పారదర్శకంగా, సమయానికి జరిగేలా చర్యలు తీసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. అందుకోసం ప్రతి డీలరు తప్పనిసరిగా ఈపాస్ మెషిన్ ద్వారా మాత్రమే విక్రయాలు జరపాలని స్పష్టం చేశారు.
ఈ మెషిన్ల వినియోగం ద్వారా రైతుల వివరాలు ఆధార్ ఆధారంగా నమోదు కానుండడంతో ప్రభుత్వ సబ్సిడీ, సరైన ధరలపై ఎరువుల లభ్యతకు గ్యారంటీ కలుగుతుందన్నారు. అలాగే ఎరువుల సరఫరాలో మోసాలు, అక్రమాలు అడ్డుకునేందుకు ఇది కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, వ్యవసాయ సహాయ సంచాలకులు కే. దామోదర్ రెడ్డి, జి. నర్సింగం, వ్యవసాయ అధికారి రవీందర్, టెక్నికల్ ఏవో కృష్ణారెడ్డి.
కోరమండల్ ఇంటర్నేషనల్ జోనల్ మేనేజర్ సుజన్ కుమార్, సుమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలోని అనేక ఎరువుల రిటైల్ డీలర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈపాస్ మెషిన్ వినియోగంపై వారికి శిక్షణనూ అందజేయడం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానం ద్వారా వ్యవసాయ రంగంలో సాంకేతిక ప్రగతికి మద్దతు లభిస్తుందని అధికారుల అభిప్రాయం వ్యక్తం చేశారు .
రిపోర్టర్. ప్రతీప్ రడపాక