తెలంగాణ ధ్వని : కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆదివారంతో భక్తుల రాక భారీగా పెరిగి, నది తీరం జనసంద్రంగా మారింది.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. పుష్కర స్నానాలు, పిండ ప్రదానం, తర్పణాలు వంటి వైదిక కార్యక్రమాలు నదీతీరాన్ని ఆధ్యాత్మికతతో నింపుతున్నాయి.
నవరత్న హారతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాశీ నుండి వచ్చిన పండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హారతి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా, 15 కిలోమీటర్ల వరకూ వాహనాలు నిలిచిపోయాయి.
వన్యప్రాంతాల్లో గూగుల్ మ్యాప్ పనిచేయక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వన్ వే మార్గాలు ఏర్పాటు చేసినా, సమర్థవంతమైన ప్రణాళిక లేకపోవడంతో ప్రయాణికులు అసౌకర్యం పడుతున్నారు.
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనంతో భక్తులు పుష్కర యాత్రను ముగిస్తున్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక